15, జులై 2017, శనివారం

'మధుమానసం'లో అందమైన వచనం 

కొందరి ప్రతిభ లలిత లలిత మైంది.       సున్నితమైన  వ్యక్తీకరణలతో  తమ మానసిక ప్రపంచాన్ని అతి సుందరంగా, లలితంగా వ్యక్తీకరిస్తారు. ఈ కోవకు   చెందిన కవయిత్రి మానస చామర్తి. ఈ ఏడాది - 2015- ఇస్మాయిల్‌ పురస్కారాన్ని ఆమెకు అందజేయనున్నట్టు యదుకుల భూషణ్‌    ఒక ప్రకటనలో తెలియజేశారు. మానస కవిత్వ పుస్తకం రాలేదు. బ్లాగులో ఆమె కవిత్వం వుంది. ఆ కవిత్వాన్నే కాదు, ఆమె వచనాన్ని చదివినా పాఠకులు ముగ్ధులవుతారు. అందుకే ప్రత్యేకించి ఆమె కవిత్వం కన్నా బ్లాగు గురించి సంక్షిప్త పరిచయం పాఠకులకు ప్రత్యేకం. 

బ్లాగు రాయడం ఓ కళ. తమ అనుభవాలు, అనుభూతులు, అంతరంగాన్ని కదిపి కుదిపే ఘటనలు ఎన్నిటినో అక్షరాల్లో కూర్చి ఆవిష్కరించడం ఓ కళాసాధన. తమ భావనా పరంపరని అందంగా, ఆర్ద్రంగా, పఠిత మనసు మెచ్చేలా రాయడం ఓ సృజనాత్మక కౌశలం. అలాంటి కౌశలం, సృజనాత్మక ప్రతిభ మానస చామర్తి గారి 'మధుమానసం' బ్లాగులో దాగుంది. చదివిన కొద్దీ చదవాలనిపించే తియ్యందనాలు ఈ బ్లాగులో వున్నాయి. 

వైవిధ్యమైన ఉత్తమ అభిరుచులతో మిళితమైన ఆమె బ్లాగు చదవడమూ చక్కటి సృజనాత్మక అనుభవం. అక్షరాలకు సౌందర్యాన్ని సమకూర్చే ఇంద్రజాలమేదో ఆమెకు ఉంది. విభిన్న ప్రక్రియలతో కూడిన ఈ బ్లాగులోని కవిత్వమూ, వచనమూ పరమ ఆకర్షణీయం. 

అప్పుడప్పుడు రాసిన కవితలు, వ్యాసాలు, యాత్రాకథనాలు, పుస్తక పఠనానుభవాలు, అనేకానేక అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ బ్లాగుకు నిండుదనాన్ని సమకూర్చాయి. సంగీతం, పాటల మీద వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఓ మార్దవం వుంది. యాత్రాకథనాల్లో 'గోకర్ణం' గురించి రాసిన లలిత లలితమైన కథనం చదవడం మనసుని పరిమళింపజేసే అనుభవం. 'శివం సుందరం గోకర్ణం' శీర్షికన రాసిన ఈ కథనం నేరుగా పాఠకుణ్ణి గోకర్ణం తీసుకెళుతుంది. అక్షరాల్లోని రమ్యత, పదాల్లోని సొగసుదనం, వాక్యాల్లోని ఇంద్రజాలం ఈ వ్యాసానికి ఒక మహత్తును సమకూ ర్చాయి. బహుశా అది ఆ ప్రాంతానికి కూడా వుందేమో! ఈ వ్యాసం చదివాక గోకర్ణం ఎప్పుడు చూద్దామా అని మనసు కొట్టుకులా డుతుంది. 

కవుల కవిత్వాల్లో నందకిశోర్‌     కవిత్వ సంపుటి 'నీలాగే ఒకడుండేవాడు' మీద రాసిన వ్యాసం, అలాగే బుచ్చిబాబు 'చివరకు మిగిలేది', చలం 'పురూరవ'లపై విశ్లేషణలు బావున్నాయి. ఈ నవలలని కొత్తతరం పాఠకులకు చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. వచనాన్ని అత్యంత సౌందర్యభరితంగా వాడుకున్న రచయితలు చలం, బుచ్చిబాబు.  వారి గురించి మానస వ్యక్తం చేసిన అభిప్రాయాలు సాహిత్యంలో సౌందర్యాన్ని చూసే ఆమె దృష్టికోణాన్ని తెలియజేస్తాయి. 

'అనుభవాలూ జ్ఞాపకాలూనూ' శీర్షికన చేసిన రచనలు కూడా వైవిధ్యంగా వున్నాయి. ఆమె ఊహాశాలితను తెలియజేస్తాయి. జ్ఞాపకాల్ని అభివ్యక్తం   చేయడంలో    వాక్యవిన్యాసమూ ఆకట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే మానస గారి ప్రతి రచనలోనూ సౌందర్యాత్మకత ప్రతిఫలిస్తుంది. గుండె గొంతులో తారాట్లాడే భావాన్ని అందంగా చెప్పాడానికి ప్రయత్నించారు. బహుశా అందంగా చెప్పడం ఆమెకు అలవోకగా అబ్బిందనిపిస్తుంది ఈ బ్లాగును చదివితే. ఒక మంచి పుస్తకంలో నచ్చిన అధ్యాయాల్ని కొంచెం కొంచెం ఇష్టంగా చదివినట్టు ఈ 'మధుమానసం' బ్లాగును చదవాలి. బ్లాగు చిరునామా: 

http://www.madhumanasam.in. మానస చామర్తి గారి గురించిన వివరాల్ని ఫేస్‌బుక్‌లోనూ చూడొచ్చు. సృజనాత్మకంగా జీవించే తత్వమే ఆమె బ్లాగుకు మూలం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...