30, మే 2020, శనివారం

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌లెట్టాక ఆగ‌కుండా చ‌దివా. రాత్రి రెండు గంట‌లు దాటినా అలా చ‌దువుతూ వుండిపోయిన స‌మయాలు ఇంకా గుర్తున్నాయి. ఎన్‌.వేణుగోపాల్ అనువాదం అద్భుతంగా వుంది. ఈ న‌వ‌ల చ‌దివే స‌మ‌యానికి వేణుగోపాల్ ఎవ‌రో తెలియ‌దు. క్యాంప‌స్‌లోకి అపుడే కొత్త‌గా వ‌చ్చిన రోజుల‌వి. ఇంకా పిడిఎస్‌యు, ఆర్ ఎస్ యు క్రియాశీల‌త కొన‌సాగుతున్న రోజులు. ఈ న‌వ‌ల ఉద్వేగ భ‌రితంగా చ‌దివించింది. ఈ న‌వ‌ల‌ని కొన్నాళ్ళ కింద‌ట తిరిగి ముద్రించారు. కానీ ఇపుడు ఆ న‌వ‌ల‌లోని స్ఫూర్తిని అందుకునే వారు ఎవ‌రు? ఏమైనా పాఠ‌‌కుడిని తీవ్ర‌మైన ఉద్విగ్న‌త‌కు లోను చేసే మాంత్రిక శ‌క్తి ఏదో ఈ న‌వ‌ల‌లో ఉంది. దానిని తెలుగులోకి తీసుకువ‌చ్చిన వేణుగోపాల్ సృజ‌న అంటే ఇప్ప‌టికీ గౌర‌వం, ఇష్టం. ఈ కాలాన మ‌రోసారి చ‌ద‌వాల్సిన న‌వ‌ల‌.

14, మే 2020, గురువారం

మ‌నుషులు చేసిన దేవుడు

పొద్దుటే కాల‌నీలో బ‌య‌ట‌కు వ‌చ్చా. ప‌క్క‌నే వున్న సాయిబాబా గుడి ముందు నుంచే వెళ్ళాలి. ఇంటి నుంచి బ‌య‌టికొచ్చి ఎక్క‌డికెళ్ళాల‌న్నా, తిరిగి ఇంటికి రావాల‌‌న్నా సాయిబాబా గుడి ముందు నుంచే. కాక‌పోతే  ప్ర‌తిసారి నాకు ఒకింత విస్మ‌యం, ఆశ్చ‌ర్యం.  ఈ రోజు గుడి త‌లుపులు మూసి వున్నాయి. లోప‌ల దీపారాధ‌న‌, ఆర‌తి కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సాధార‌ణంగా గురువారం గుడి చుట్టుప‌క్క‌ల హ‌డావిడి వుంటుంది. టూవీల‌ర్స్ బారులు తీరి వుంటాయి. ఆ ప‌క్క‌న ఈ ప‌క్క‌న ద‌యా హృద‌యుల కోసం కొంద‌రు వేచి వుంటారు. మ‌ధ్యాహ్నం గురువారం అన్న‌ప్ర‌సాదం కోసం వ‌చ్చేవారు వంద‌ల‌లో వుంటారు. ఇపుడు ఆ దృశ్యాలేవీ లేవు. ఒక్క బండి కూడా క‌నిపించ‌లేదు. ఒక‌రిద్ద‌రు భ‌క్తులు వెళుతూ కొన్ని క్ష‌ణాలు ఆగి న‌మ‌స్క‌రించుకుని సాగిపోయారు.
క‌రోనా నేప‌థ్యాన లాక్‌డౌన్ త‌రువాత ప‌దిహేను రోజులకు అక్క‌డ కూర‌గాయ‌ల కోసం రైతు బ‌జార్‌కు వ‌స్తే మూసివున్న గుడి క‌నిపించింది. మ‌రో ప‌దిరోజుల త‌రువాత సాయంత్రం పూట బ‌య‌ట‌కి వ‌చ్చిన‌పుడు ఆరు గంట‌ల వేళ లోప‌ల ఆర‌తి జ‌ర‌గ‌డం వినిపించింది. గేట్లు మూసివున్నాయి. పూజారుల స్వ‌రాలు, సాయిబాబా గీతాలు వినిపించాయి. మ‌ర‌ల ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాలు చెవిన బ‌డ్డాయి.
సాయిబాబా నాకు ఎపుడూ ఒక విస్మ‌యం. వందేళ్ళ కింద‌ట వ‌ర‌కు మ‌నుషుల మ‌ధ్య‌నే తిరుగాడిన మ‌నిషి కోట్లాది మందికి ఆరాధ్యుడ‌య్యాడు. నేను నాకు తెలియ‌క‌నే సాయిబాబా భ‌క్తుల‌నీ, ఆయ‌న‌ని ఆరాధించే వారిని చూస్తున్నాను, ప‌రిశీలిస్తున్నాను.  ఈ అసంక‌ల్పిత ప‌రిశీల‌న ప‌రిప‌రివిధాల ఆలోచింప‌జేసేది.
కొన్నేళ్ళ కింద‌ట వ‌ర‌కు గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారం. ఆ త‌రువాత నాలుగు ఇళ్ళ అవ‌త‌ల వీధిలోకి మా నివాసం మారింది. అయిన‌ప్ప‌టికీ గుడి ముందు నుంచే రాక‌డ పోక‌డ‌. కొత్త‌లో ఇది గ‌ణేష్ టెంపుల్‌... క్ర‌మ‌క్ర‌మంగా సాయిబాబా గుడిగా ప్ర‌సిద్ది చెందింది.  ఇత‌ర సాయిబాబా ఆల‌యాల‌తో పోల్చుకుంటే ఇది చిన్న గుడి. దీనిలోనే వినాయ‌కుడు, శివుడు, వాస‌విమాత‌, ల‌క్ష్మీదేవి కొలువు దీరారు. అయిన‌ప్ప‌టికీ గుడిలోకి వ‌చ్చేవారు తొలుత సాయిబాబానే పూజించేవారు. ఇదివ‌ర‌లో మొద‌ట ఏ పూజ‌యినా విఘ్నేశ్వ‌రుడుకి చేసేవారు. కానీ ఇపుడు తొలుత భ‌క్తులు త‌ల‌చేది, కొలిచేది సాయిబాబానే. ఆ త‌రువాతే ఎవ‌ర‌యినా.
సాయిబాబా వందేళ్ళ కింద‌టివ‌ర‌కు మాన‌వుల మ‌ధ్య తిరుగాడిన మ‌నిషి. ఆయ‌న స‌మ‌కాలికులు, ఆయ‌న‌తో గ‌డిపిన వారు ఇపుడు లేక‌పోవ‌చ్చు. కానీ ఆయ‌నని ద‌గ్గ‌ర‌గా చూసిన మ‌నుషుల మాట‌లు విన్న‌వారి, చూసిన‌వారితో గ‌డిపిన మ‌నుషులు అక్క‌డ‌క్క‌డ ఉన్నారు.  ఆయ‌న మాన‌వుడే అని చెప్ప‌డానికి ఫొటోలు కూడా ఉన్నాయి. ఆయ‌న గురించి రాసిన పుస్త‌కాలున్నాయి. తీసిన సినిమాలున్నాయి. నా ప‌నుల‌లో నేను వుంటూనే అనుకోకుండా సాయిబాబా గురించి హేమ‌ద్‌పంత్ రాసిన పుస్త‌కం చ‌దివా. ఆ త‌రువాత ఎక్కిరాల భ‌ర‌ద్వాజ రాసిన పుస్త‌కం చ‌దివా. ఇంగ్లీషులో ఎం.వి. కామ‌త్ రాసిన పుస్త‌కం, హిందూ ప‌త్రిక సాయిబాబా మీద వెలువ‌రించిన ప్ర‌త్యేక సంచిక చ‌దివా. సాయిబాబా శ‌త‌వ‌ర్థంతి (2019) సంద‌ర్భంగా తీసుకొచ్చిన సంచిక ఇది. ఇవేవీ   సాయిబాబా జీవిత‌చ‌రిత్ర‌ని స‌మ‌గ్రంగా చెప్ప‌లేదు. కానీ సాయిబాబా గురించి తెలుసుకోడానికి కొన్ని ఆధారాలు వీటిలో ల‌భిస్తాయి. అలాగే కొంద‌రు విదేశీయులు అక్క‌డ‌క్క‌డ చెప్పిన అంశాలు, మ‌రికొంత ఇంట‌ర్నెట్ స‌మాచారం త‌ర‌చి చూశా. ఇవేవీ సాయిబాబా వాస్త‌వ జీవిత‌చ‌రిత్ర‌ని చెప్ప‌లేదు. మ‌రాఠీ భాష‌లో ఎవ‌ర‌యినా ఏమైనా రాశారేమో తెలియ‌దు. అక్క‌డి మిత్రులు ఎవ‌ర‌యినా చెప్పాలి. బాబాని దైవంగా ఆరాధించే అంశాల ప్రాధాన్యమే ఈ పుస్త‌కాల‌లో ఎక్కువ‌.

మ‌నుషుల మ‌ధ్య‌నే బ‌తికిన ఒక మ‌నిషి కోట్లాది మందికి దేవుడు కావ‌డం విస్మ‌యం.
సాయిబాబా త‌న‌కు తాను దేవుడ‌ని చెప్పుకోలేదు. మ‌హిమ‌లున్నాయ‌ని చాట‌లేదు. ఒక సూఫీ ఫ‌కీరులా జీవించాడు. అలాగే త‌న పుట్టు పూర్వోత్త‌రాల గురించి చెప్ప‌లేదు. కుల‌మ‌తాల‌కు అతీతంగా ఉన్నారు. అతి మామూలు మ‌నిషిగా గ‌డిపాడు బ‌తుకంతా. త‌న‌కు పూజ‌లు పున‌స్క‌రాలు చేయాల‌ని అడ‌గ‌లేదు.
సాయిబాబాని కొంద‌రు ముస్లిం అన్నారు. ఇంకొంద‌రు హిందూ అన్నారు. వాటితో ఆయ‌నకు నిమిత్తం లేదు.
2014 త‌రువాత కొంత‌మంది సాయిబాబాని ఆరాధించ‌డానికి వీల్లేద‌న్నారు. అది సాయిభ‌క్తుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఒక మైనారిటీ మ‌తానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టి పూజించ‌వ‌ద్ద‌నే మాటని ఎవ‌రూ మ‌న్నించ‌లేదు. అలాగే ఇటీవ‌ల సాయిబాబా జ‌న్మ‌స్థ‌లం గురించి ఒక వివాదం రేపారు. నిజానికి సాయిబాబా త‌ను ఎక్క‌డ పుట్టాడో ఏనాడూ చెప్ప‌లేదు. అందుక‌ని ఆయ‌న జ‌న్మ‌స్థ‌ల వివాదం అర్థ‌ర‌హితం.
క‌రోనా కాలంలో షిరిడిలోని ప్ర‌ధాన ఆలయ‌మే కాదు దేశ‌వ్యాప్తంగా వున్న వంద‌లాది సాయిబాబా ఆల‌యాల ద్వారాలు మూసి వున్నాయి.  కానీ ఆయ‌న్ని ఆరాధించేవారు క‌విత‌లు, గేయాలు రాస్తున్నారు. సాయిబాబా అంటే న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్న‌వారు ఆయ‌న ప‌ట్ల అచంచ‌ల ఆరాధ‌నా భావంతోనే వున్నారు.
సాయిబాబా తెలుగువారికి ఒక ఆధ్యాత్మిక ఐకాన్‌.
అయితే సాయిబాబా జీవ‌న‌గ‌మ‌నాన్ని ప‌రిశీలిస్తే ఆయ‌న జీవిత‌మంతా ఒక ఫ‌కీరులా, ఒక సంత్‌లా బ‌తికారు. ఒక బైరాగిలానే జీవించారు. బోధ‌లు, ప్ర‌బోధాలు చేయ‌లేదు. విలాస భ‌వ‌నాల‌లో నివ‌సించ‌లేదు. మ‌నుషుల మ‌ధ్య అతి మామూలు మ‌నిషిగా బ‌తికాడు. అందుకే ఇత‌ర బాబాల‌కు భిన్నం సాయిబాబా అనిపించింది. అందుకే సంత్ గాడ్గేబాబా గురించి సాంబ‌శివ‌రావు రాసిన‌ట్టు సాయిబాబా గురించి ఎవ‌ర‌యినా రాస్తే బాగుండ‌నిపించింది.

4, మే 2020, సోమవారం

palapitta editorial


కొత్త ఇతివృత్తం
మొట్టమొదటిసారి యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. కరోనా కల్లోలం ఎక్కడికక్కడ మనుషుల్ని నిలువరించింది. ఉన్నచోటనే ఉండిపోక తప్పని పరిస్థితుల్ని సృష్టించింది. పని చేస్తే తప్ప పూట గడవని వారు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విపత్తుకు ఎలా స్పందించాలో తెలియక లోకమంతా నిశ్చేష్ట కాగా, తొలుత జర్నలిస్టులు, కవులు, రచయితలు స్పందిస్తూ వచ్చారు. కొందరు జర్నలిస్టులు కరోనా గురించి మన దగ్గర ఫిబ్రవరి లోనే హెచ్చ‌రించారు.  కానీ దాని తీవ్రతని గుర్తించ నిరాకరించిన విధాననిర్ణేతలు ఆస్యంగా స్పందించారు. అయినప్పటికీ సంపన్నదేశాల‌ కన్నా మెరుగయిన స్థితిలో ఉండటం ఇప్పటికయితే సాధ్యపడిరది.
ఎప్పటి మాదిరిగానే తెలుగు నాట కరోనా మీద కవిత్వమే విస్తారంగా వస్తున్నది. కొద్దిమంది మాత్రమే కరోనా ప్రభావిత బతుకు తండ్లాటని కథలుగా రాస్తున్నారు. వచనంలో మున్ముందు ఎలాంటి రచనలు వస్తాయో చూడాలి. లాక్‌డౌన్‌ పీరియడ్‌ జనం బతుకుల్లో సృష్టించిన ఆర్థిక, మానసిక, సాంస్కృతిక కల్లోలం అనూహ్యం. పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్న సంక్షోభ సందర్భమిది. ధీరగుణం ప్రదర్శించాని కొందరు చెబుతున్నప్పటికీ అది అంత సులువు కాదు. కనుకనే జన జీవితాన్ని విషాద బీభత్సానికి లోను చేసిన ఈ కాలం సృజనశీలురకు తగిన ఇతివృత్తం. దీని మీద నవల‌లు రావాల్సి వుం ది. ‘కరోనా కాలం’ మీద నాన్‌ ఫిక్షన్‌ కూడా వచ్చే అవకాశముంది.  తెలుగునాట రచయితలు ఎలా స్పందిస్తారో చూడాలి.
1929 నాటి మహా మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) కాలం, తర్వాత రెండు ప్రపంచ యుద్ధా కాలం నాటి జనం బతుకుల‌కు సంబంధించిన ప్రతిఫల‌నాలు కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో కొంతవరకు కనిపిస్తాయి. మరి ఇవాళ కరోనా కాల‌పు భీతావహస్థితి సాహిత్య, కళారూపాల్లో చిత్రితమయ్యే తీరును మున్ముందు చూడగలం. తక్షణ స్పందనగా వచ్చే కవిత్వంలో భిన్నధోరణలున్నాయి. కానీ ఈ విపత్తు తీవ్రత ప్రభావం సామాజిక, వైయుక్తిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ సంక్షుభిత సన్నివేశాలు సాహిత్యంలోనే ప్రబలంగా చిత్రించడం సాధ్యం. కొన్ని అంశాలు మీడియా కూడా చెప్పలేదు. రచయితలే చెప్పగల‌రు. సోషల్‌మీడియాలో తక్షణ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. మనవాళ్ళ ఆలోచనల‌ తీరుతెన్నుల‌ను తెలసుకోడానికి ఇవి ఉపకరిస్తాయి.
అసలు ముందుగా కరోనాకు సంబంధించిన నిర్దిష్ట అవగాహనని సంతరించు కోవాలి. ఇంతటి ఘోర విపత్తు సంభవించినప్పటికీ శాస్త్రీయ దృష్టితో ఆలోచించే ధోరణి కొరవడటం గమనించదగ్గ అంశం. కొన్ని దేశాల‌నో, కొన్ని వర్గాల‌నో, కొన్ని జాతుల‌నో నిందించే తీరును చూడొచ్చు. కానీ ఇపుడు కావాల్సింది సమ్యక్‌ వివేచన, సమగ్రమైన, హేతుబద్ధమైన ఆలోచనా విధానం. ఇతరుల‌ సంగతి ఎలా ఉన్నా కవుల‌కీ, రచయితల‌కీ ఈ వివేచన తప్పనిసరి. అలాంటప్పుడే వారి సృజనాత్మక వ్యాసంగం సరైన దిశలో సాగుతుంది.
కరోనా కాలంలో కొందరు చాలా పుస్తకాలు చదువుతున్నారు. చదివే అల‌వాట్లు ఇంకా బలంగానే ఉన్నాయని రుజువు చేసిన సందర్భమిది. సైన్స్‌ఫిక్షన్‌ పట్ల కూడా ఆసక్తిని పెంచుకుంటే వారి అధ్యయనశీల‌త కొత్త అనుభవాల్ని సంతరించుకుంటుంది. అనివార్యంగా ఇంటికే పరిమితమయిన సందర్భంలో కవుల‌, రచయితల‌ క్రియాశీల‌త ఇనుమడించింది. ఇది మున్ముందు కాలాన మంచి ఫలితాలు ఇస్తుందన్నదే ఆశ.

(పాల‌పిట్ట ఎడిటోరియ‌ల్‌, 30 ఏప్రిల్ 2020)

18, ఏప్రిల్ 2019, గురువారం

మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే విగ్రహాల ధ్వంసం ఆధిపత్య కులాలకు పరిపాటయ్యింది. దళితుల మీద నేరుగా దాడులు చేయలేనపుడు అంబేద్కర్‌ విగ్రహాల్ని లక్ష్యంగా చేసుకుంటారు. అనేకమంది నాయకుల విగ్రహాలున్నా కేవలం అంబేద్కర్‌ విగ్రహమే లక్ష్యం కావడం గమనార్హం. ఎందుకంటే అంబేద్కర్‌ ప్రతిమ కేవలం ఉత్సవ విగ్రహం కాదు, ధిక్కార నినాద గొంతుక. అణచివేతకు లోనయ్యే వారి ఆత్మగౌరవ ప్రతీక. ఆధిపత్యకులాల పెత్తనాల మీద తిరుగుబాటు బావుటా. కులనిర్మూలన కోసం సంఘటితమయ్యే పీడిత కులాల సాంస్కృతిక ఆయుధం.

26, జనవరి 2018, శుక్రవారం

అలరాస పుట్టిళ్ళు క‌థ‌ల‌ పుస్తకం మ‌ర‌ల మ‌ర‌ల చ‌ద‌వాల్సిన పుస్త‌కం. ర‌చ‌యిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.
వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.
కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.
కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.
చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.
ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.
పాఠ‌కుని స‌మ‌యాన్ని వృధా చేయ‌ని మేలిమి క‌థ‌ల సంపుటి అల‌రాస పుట్టిళ్ళు. 

15, జులై 2017, శనివారం

'మధుమానసం'లో అందమైన వచనం 

కొందరి ప్రతిభ లలిత లలిత మైంది.       సున్నితమైన  వ్యక్తీకరణలతో  తమ మానసిక ప్రపంచాన్ని అతి సుందరంగా, లలితంగా వ్యక్తీకరిస్తారు. ఈ కోవకు   చెందిన కవయిత్రి మానస చామర్తి. ఈ ఏడాది - 2015- ఇస్మాయిల్‌ పురస్కారాన్ని ఆమెకు అందజేయనున్నట్టు యదుకుల భూషణ్‌    ఒక ప్రకటనలో తెలియజేశారు. మానస కవిత్వ పుస్తకం రాలేదు. బ్లాగులో ఆమె కవిత్వం వుంది. ఆ కవిత్వాన్నే కాదు, ఆమె వచనాన్ని చదివినా పాఠకులు ముగ్ధులవుతారు. అందుకే ప్రత్యేకించి ఆమె కవిత్వం కన్నా బ్లాగు గురించి సంక్షిప్త పరిచయం పాఠకులకు ప్రత్యేకం. 

బ్లాగు రాయడం ఓ కళ. తమ అనుభవాలు, అనుభూతులు, అంతరంగాన్ని కదిపి కుదిపే ఘటనలు ఎన్నిటినో అక్షరాల్లో కూర్చి ఆవిష్కరించడం ఓ కళాసాధన. తమ భావనా పరంపరని అందంగా, ఆర్ద్రంగా, పఠిత మనసు మెచ్చేలా రాయడం ఓ సృజనాత్మక కౌశలం. అలాంటి కౌశలం, సృజనాత్మక ప్రతిభ మానస చామర్తి గారి 'మధుమానసం' బ్లాగులో దాగుంది. చదివిన కొద్దీ చదవాలనిపించే తియ్యందనాలు ఈ బ్లాగులో వున్నాయి. 

వైవిధ్యమైన ఉత్తమ అభిరుచులతో మిళితమైన ఆమె బ్లాగు చదవడమూ చక్కటి సృజనాత్మక అనుభవం. అక్షరాలకు సౌందర్యాన్ని సమకూర్చే ఇంద్రజాలమేదో ఆమెకు ఉంది. విభిన్న ప్రక్రియలతో కూడిన ఈ బ్లాగులోని కవిత్వమూ, వచనమూ పరమ ఆకర్షణీయం. 

అప్పుడప్పుడు రాసిన కవితలు, వ్యాసాలు, యాత్రాకథనాలు, పుస్తక పఠనానుభవాలు, అనేకానేక అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ బ్లాగుకు నిండుదనాన్ని సమకూర్చాయి. సంగీతం, పాటల మీద వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఓ మార్దవం వుంది. యాత్రాకథనాల్లో 'గోకర్ణం' గురించి రాసిన లలిత లలితమైన కథనం చదవడం మనసుని పరిమళింపజేసే అనుభవం. 'శివం సుందరం గోకర్ణం' శీర్షికన రాసిన ఈ కథనం నేరుగా పాఠకుణ్ణి గోకర్ణం తీసుకెళుతుంది. అక్షరాల్లోని రమ్యత, పదాల్లోని సొగసుదనం, వాక్యాల్లోని ఇంద్రజాలం ఈ వ్యాసానికి ఒక మహత్తును సమకూ ర్చాయి. బహుశా అది ఆ ప్రాంతానికి కూడా వుందేమో! ఈ వ్యాసం చదివాక గోకర్ణం ఎప్పుడు చూద్దామా అని మనసు కొట్టుకులా డుతుంది. 

కవుల కవిత్వాల్లో నందకిశోర్‌     కవిత్వ సంపుటి 'నీలాగే ఒకడుండేవాడు' మీద రాసిన వ్యాసం, అలాగే బుచ్చిబాబు 'చివరకు మిగిలేది', చలం 'పురూరవ'లపై విశ్లేషణలు బావున్నాయి. ఈ నవలలని కొత్తతరం పాఠకులకు చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. వచనాన్ని అత్యంత సౌందర్యభరితంగా వాడుకున్న రచయితలు చలం, బుచ్చిబాబు.  వారి గురించి మానస వ్యక్తం చేసిన అభిప్రాయాలు సాహిత్యంలో సౌందర్యాన్ని చూసే ఆమె దృష్టికోణాన్ని తెలియజేస్తాయి. 

'అనుభవాలూ జ్ఞాపకాలూనూ' శీర్షికన చేసిన రచనలు కూడా వైవిధ్యంగా వున్నాయి. ఆమె ఊహాశాలితను తెలియజేస్తాయి. జ్ఞాపకాల్ని అభివ్యక్తం   చేయడంలో    వాక్యవిన్యాసమూ ఆకట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే మానస గారి ప్రతి రచనలోనూ సౌందర్యాత్మకత ప్రతిఫలిస్తుంది. గుండె గొంతులో తారాట్లాడే భావాన్ని అందంగా చెప్పాడానికి ప్రయత్నించారు. బహుశా అందంగా చెప్పడం ఆమెకు అలవోకగా అబ్బిందనిపిస్తుంది ఈ బ్లాగును చదివితే. ఒక మంచి పుస్తకంలో నచ్చిన అధ్యాయాల్ని కొంచెం కొంచెం ఇష్టంగా చదివినట్టు ఈ 'మధుమానసం' బ్లాగును చదవాలి. బ్లాగు చిరునామా: 

http://www.madhumanasam.in. మానస చామర్తి గారి గురించిన వివరాల్ని ఫేస్‌బుక్‌లోనూ చూడొచ్చు. సృజనాత్మకంగా జీవించే తత్వమే ఆమె బ్లాగుకు మూలం.

10, మార్చి 2017, శుక్రవారం

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి పుస్తకం చదివా. వారి అనుభావాల పరమ్పర బాగుంది.

రాసిన తీరు నచ్చింది.

కొన్ని కొత్త విషయాలున్నాయి.

ఒక మనిషి ప్రయాణం ఎన్ని విధాలుగా మలుపులు తిరిగే అవకాశం ఉన్నదో తెలుస్తుంది.
ఆ ప్రయాణమే ఆసక్తికరం. 

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...