30, మే 2020, శనివారం

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌లెట్టాక ఆగ‌కుండా చ‌దివా. రాత్రి రెండు గంట‌లు దాటినా అలా చ‌దువుతూ వుండిపోయిన స‌మయాలు ఇంకా గుర్తున్నాయి. ఎన్‌.వేణుగోపాల్ అనువాదం అద్భుతంగా వుంది. ఈ న‌వ‌ల చ‌దివే స‌మ‌యానికి వేణుగోపాల్ ఎవ‌రో తెలియ‌దు. క్యాంప‌స్‌లోకి అపుడే కొత్త‌గా వ‌చ్చిన రోజుల‌వి. ఇంకా పిడిఎస్‌యు, ఆర్ ఎస్ యు క్రియాశీల‌త కొన‌సాగుతున్న రోజులు. ఈ న‌వ‌ల ఉద్వేగ భ‌రితంగా చ‌దివించింది. ఈ న‌వ‌ల‌ని కొన్నాళ్ళ కింద‌ట తిరిగి ముద్రించారు. కానీ ఇపుడు ఆ న‌వ‌ల‌లోని స్ఫూర్తిని అందుకునే వారు ఎవ‌రు? ఏమైనా పాఠ‌‌కుడిని తీవ్ర‌మైన ఉద్విగ్న‌త‌కు లోను చేసే మాంత్రిక శ‌క్తి ఏదో ఈ న‌వ‌ల‌లో ఉంది. దానిని తెలుగులోకి తీసుకువ‌చ్చిన వేణుగోపాల్ సృజ‌న అంటే ఇప్ప‌టికీ గౌర‌వం, ఇష్టం. ఈ కాలాన మ‌రోసారి చ‌ద‌వాల్సిన న‌వ‌ల‌.

14, మే 2020, గురువారం

మ‌నుషులు చేసిన దేవుడు

పొద్దుటే కాల‌నీలో బ‌య‌ట‌కు వ‌చ్చా. ప‌క్క‌నే వున్న సాయిబాబా గుడి ముందు నుంచే వెళ్ళాలి. ఇంటి నుంచి బ‌య‌టికొచ్చి ఎక్క‌డికెళ్ళాల‌న్నా, తిరిగి ఇంటికి రావాల‌‌న్నా సాయిబాబా గుడి ముందు నుంచే. కాక‌పోతే  ప్ర‌తిసారి నాకు ఒకింత విస్మ‌యం, ఆశ్చ‌ర్యం.  ఈ రోజు గుడి త‌లుపులు మూసి వున్నాయి. లోప‌ల దీపారాధ‌న‌, ఆర‌తి కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సాధార‌ణంగా గురువారం గుడి చుట్టుప‌క్క‌ల హ‌డావిడి వుంటుంది. టూవీల‌ర్స్ బారులు తీరి వుంటాయి. ఆ ప‌క్క‌న ఈ ప‌క్క‌న ద‌యా హృద‌యుల కోసం కొంద‌రు వేచి వుంటారు. మ‌ధ్యాహ్నం గురువారం అన్న‌ప్ర‌సాదం కోసం వ‌చ్చేవారు వంద‌ల‌లో వుంటారు. ఇపుడు ఆ దృశ్యాలేవీ లేవు. ఒక్క బండి కూడా క‌నిపించ‌లేదు. ఒక‌రిద్ద‌రు భ‌క్తులు వెళుతూ కొన్ని క్ష‌ణాలు ఆగి న‌మ‌స్క‌రించుకుని సాగిపోయారు.
క‌రోనా నేప‌థ్యాన లాక్‌డౌన్ త‌రువాత ప‌దిహేను రోజులకు అక్క‌డ కూర‌గాయ‌ల కోసం రైతు బ‌జార్‌కు వ‌స్తే మూసివున్న గుడి క‌నిపించింది. మ‌రో ప‌దిరోజుల త‌రువాత సాయంత్రం పూట బ‌య‌ట‌కి వ‌చ్చిన‌పుడు ఆరు గంట‌ల వేళ లోప‌ల ఆర‌తి జ‌ర‌గ‌డం వినిపించింది. గేట్లు మూసివున్నాయి. పూజారుల స్వ‌రాలు, సాయిబాబా గీతాలు వినిపించాయి. మ‌ర‌ల ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాలు చెవిన బ‌డ్డాయి.
సాయిబాబా నాకు ఎపుడూ ఒక విస్మ‌యం. వందేళ్ళ కింద‌ట వ‌ర‌కు మ‌నుషుల మ‌ధ్య‌నే తిరుగాడిన మ‌నిషి కోట్లాది మందికి ఆరాధ్యుడ‌య్యాడు. నేను నాకు తెలియ‌క‌నే సాయిబాబా భ‌క్తుల‌నీ, ఆయ‌న‌ని ఆరాధించే వారిని చూస్తున్నాను, ప‌రిశీలిస్తున్నాను.  ఈ అసంక‌ల్పిత ప‌రిశీల‌న ప‌రిప‌రివిధాల ఆలోచింప‌జేసేది.
కొన్నేళ్ళ కింద‌ట వ‌ర‌కు గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారం. ఆ త‌రువాత నాలుగు ఇళ్ళ అవ‌త‌ల వీధిలోకి మా నివాసం మారింది. అయిన‌ప్ప‌టికీ గుడి ముందు నుంచే రాక‌డ పోక‌డ‌. కొత్త‌లో ఇది గ‌ణేష్ టెంపుల్‌... క్ర‌మ‌క్ర‌మంగా సాయిబాబా గుడిగా ప్ర‌సిద్ది చెందింది.  ఇత‌ర సాయిబాబా ఆల‌యాల‌తో పోల్చుకుంటే ఇది చిన్న గుడి. దీనిలోనే వినాయ‌కుడు, శివుడు, వాస‌విమాత‌, ల‌క్ష్మీదేవి కొలువు దీరారు. అయిన‌ప్ప‌టికీ గుడిలోకి వ‌చ్చేవారు తొలుత సాయిబాబానే పూజించేవారు. ఇదివ‌ర‌లో మొద‌ట ఏ పూజ‌యినా విఘ్నేశ్వ‌రుడుకి చేసేవారు. కానీ ఇపుడు తొలుత భ‌క్తులు త‌ల‌చేది, కొలిచేది సాయిబాబానే. ఆ త‌రువాతే ఎవ‌ర‌యినా.
సాయిబాబా వందేళ్ళ కింద‌టివ‌ర‌కు మాన‌వుల మ‌ధ్య తిరుగాడిన మ‌నిషి. ఆయ‌న స‌మ‌కాలికులు, ఆయ‌న‌తో గ‌డిపిన వారు ఇపుడు లేక‌పోవ‌చ్చు. కానీ ఆయ‌నని ద‌గ్గ‌ర‌గా చూసిన మ‌నుషుల మాట‌లు విన్న‌వారి, చూసిన‌వారితో గ‌డిపిన మ‌నుషులు అక్క‌డ‌క్క‌డ ఉన్నారు.  ఆయ‌న మాన‌వుడే అని చెప్ప‌డానికి ఫొటోలు కూడా ఉన్నాయి. ఆయ‌న గురించి రాసిన పుస్త‌కాలున్నాయి. తీసిన సినిమాలున్నాయి. నా ప‌నుల‌లో నేను వుంటూనే అనుకోకుండా సాయిబాబా గురించి హేమ‌ద్‌పంత్ రాసిన పుస్త‌కం చ‌దివా. ఆ త‌రువాత ఎక్కిరాల భ‌ర‌ద్వాజ రాసిన పుస్త‌కం చ‌దివా. ఇంగ్లీషులో ఎం.వి. కామ‌త్ రాసిన పుస్త‌కం, హిందూ ప‌త్రిక సాయిబాబా మీద వెలువ‌రించిన ప్ర‌త్యేక సంచిక చ‌దివా. సాయిబాబా శ‌త‌వ‌ర్థంతి (2019) సంద‌ర్భంగా తీసుకొచ్చిన సంచిక ఇది. ఇవేవీ   సాయిబాబా జీవిత‌చ‌రిత్ర‌ని స‌మ‌గ్రంగా చెప్ప‌లేదు. కానీ సాయిబాబా గురించి తెలుసుకోడానికి కొన్ని ఆధారాలు వీటిలో ల‌భిస్తాయి. అలాగే కొంద‌రు విదేశీయులు అక్క‌డ‌క్క‌డ చెప్పిన అంశాలు, మ‌రికొంత ఇంట‌ర్నెట్ స‌మాచారం త‌ర‌చి చూశా. ఇవేవీ సాయిబాబా వాస్త‌వ జీవిత‌చ‌రిత్ర‌ని చెప్ప‌లేదు. మ‌రాఠీ భాష‌లో ఎవ‌ర‌యినా ఏమైనా రాశారేమో తెలియ‌దు. అక్క‌డి మిత్రులు ఎవ‌ర‌యినా చెప్పాలి. బాబాని దైవంగా ఆరాధించే అంశాల ప్రాధాన్యమే ఈ పుస్త‌కాల‌లో ఎక్కువ‌.

మ‌నుషుల మ‌ధ్య‌నే బ‌తికిన ఒక మ‌నిషి కోట్లాది మందికి దేవుడు కావ‌డం విస్మ‌యం.
సాయిబాబా త‌న‌కు తాను దేవుడ‌ని చెప్పుకోలేదు. మ‌హిమ‌లున్నాయ‌ని చాట‌లేదు. ఒక సూఫీ ఫ‌కీరులా జీవించాడు. అలాగే త‌న పుట్టు పూర్వోత్త‌రాల గురించి చెప్ప‌లేదు. కుల‌మ‌తాల‌కు అతీతంగా ఉన్నారు. అతి మామూలు మ‌నిషిగా గ‌డిపాడు బ‌తుకంతా. త‌న‌కు పూజ‌లు పున‌స్క‌రాలు చేయాల‌ని అడ‌గ‌లేదు.
సాయిబాబాని కొంద‌రు ముస్లిం అన్నారు. ఇంకొంద‌రు హిందూ అన్నారు. వాటితో ఆయ‌నకు నిమిత్తం లేదు.
2014 త‌రువాత కొంత‌మంది సాయిబాబాని ఆరాధించ‌డానికి వీల్లేద‌న్నారు. అది సాయిభ‌క్తుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఒక మైనారిటీ మ‌తానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టి పూజించ‌వ‌ద్ద‌నే మాటని ఎవ‌రూ మ‌న్నించ‌లేదు. అలాగే ఇటీవ‌ల సాయిబాబా జ‌న్మ‌స్థ‌లం గురించి ఒక వివాదం రేపారు. నిజానికి సాయిబాబా త‌ను ఎక్క‌డ పుట్టాడో ఏనాడూ చెప్ప‌లేదు. అందుక‌ని ఆయ‌న జ‌న్మ‌స్థ‌ల వివాదం అర్థ‌ర‌హితం.
క‌రోనా కాలంలో షిరిడిలోని ప్ర‌ధాన ఆలయ‌మే కాదు దేశ‌వ్యాప్తంగా వున్న వంద‌లాది సాయిబాబా ఆల‌యాల ద్వారాలు మూసి వున్నాయి.  కానీ ఆయ‌న్ని ఆరాధించేవారు క‌విత‌లు, గేయాలు రాస్తున్నారు. సాయిబాబా అంటే న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్న‌వారు ఆయ‌న ప‌ట్ల అచంచ‌ల ఆరాధ‌నా భావంతోనే వున్నారు.
సాయిబాబా తెలుగువారికి ఒక ఆధ్యాత్మిక ఐకాన్‌.
అయితే సాయిబాబా జీవ‌న‌గ‌మ‌నాన్ని ప‌రిశీలిస్తే ఆయ‌న జీవిత‌మంతా ఒక ఫ‌కీరులా, ఒక సంత్‌లా బ‌తికారు. ఒక బైరాగిలానే జీవించారు. బోధ‌లు, ప్ర‌బోధాలు చేయ‌లేదు. విలాస భ‌వ‌నాల‌లో నివ‌సించ‌లేదు. మ‌నుషుల మ‌ధ్య అతి మామూలు మ‌నిషిగా బ‌తికాడు. అందుకే ఇత‌ర బాబాల‌కు భిన్నం సాయిబాబా అనిపించింది. అందుకే సంత్ గాడ్గేబాబా గురించి సాంబ‌శివ‌రావు రాసిన‌ట్టు సాయిబాబా గురించి ఎవ‌ర‌యినా రాస్తే బాగుండ‌నిపించింది.

4, మే 2020, సోమవారం

palapitta editorial


కొత్త ఇతివృత్తం
మొట్టమొదటిసారి యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. కరోనా కల్లోలం ఎక్కడికక్కడ మనుషుల్ని నిలువరించింది. ఉన్నచోటనే ఉండిపోక తప్పని పరిస్థితుల్ని సృష్టించింది. పని చేస్తే తప్ప పూట గడవని వారు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విపత్తుకు ఎలా స్పందించాలో తెలియక లోకమంతా నిశ్చేష్ట కాగా, తొలుత జర్నలిస్టులు, కవులు, రచయితలు స్పందిస్తూ వచ్చారు. కొందరు జర్నలిస్టులు కరోనా గురించి మన దగ్గర ఫిబ్రవరి లోనే హెచ్చ‌రించారు.  కానీ దాని తీవ్రతని గుర్తించ నిరాకరించిన విధాననిర్ణేతలు ఆస్యంగా స్పందించారు. అయినప్పటికీ సంపన్నదేశాల‌ కన్నా మెరుగయిన స్థితిలో ఉండటం ఇప్పటికయితే సాధ్యపడిరది.
ఎప్పటి మాదిరిగానే తెలుగు నాట కరోనా మీద కవిత్వమే విస్తారంగా వస్తున్నది. కొద్దిమంది మాత్రమే కరోనా ప్రభావిత బతుకు తండ్లాటని కథలుగా రాస్తున్నారు. వచనంలో మున్ముందు ఎలాంటి రచనలు వస్తాయో చూడాలి. లాక్‌డౌన్‌ పీరియడ్‌ జనం బతుకుల్లో సృష్టించిన ఆర్థిక, మానసిక, సాంస్కృతిక కల్లోలం అనూహ్యం. పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్న సంక్షోభ సందర్భమిది. ధీరగుణం ప్రదర్శించాని కొందరు చెబుతున్నప్పటికీ అది అంత సులువు కాదు. కనుకనే జన జీవితాన్ని విషాద బీభత్సానికి లోను చేసిన ఈ కాలం సృజనశీలురకు తగిన ఇతివృత్తం. దీని మీద నవల‌లు రావాల్సి వుం ది. ‘కరోనా కాలం’ మీద నాన్‌ ఫిక్షన్‌ కూడా వచ్చే అవకాశముంది.  తెలుగునాట రచయితలు ఎలా స్పందిస్తారో చూడాలి.
1929 నాటి మహా మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) కాలం, తర్వాత రెండు ప్రపంచ యుద్ధా కాలం నాటి జనం బతుకుల‌కు సంబంధించిన ప్రతిఫల‌నాలు కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో కొంతవరకు కనిపిస్తాయి. మరి ఇవాళ కరోనా కాల‌పు భీతావహస్థితి సాహిత్య, కళారూపాల్లో చిత్రితమయ్యే తీరును మున్ముందు చూడగలం. తక్షణ స్పందనగా వచ్చే కవిత్వంలో భిన్నధోరణలున్నాయి. కానీ ఈ విపత్తు తీవ్రత ప్రభావం సామాజిక, వైయుక్తిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ సంక్షుభిత సన్నివేశాలు సాహిత్యంలోనే ప్రబలంగా చిత్రించడం సాధ్యం. కొన్ని అంశాలు మీడియా కూడా చెప్పలేదు. రచయితలే చెప్పగల‌రు. సోషల్‌మీడియాలో తక్షణ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. మనవాళ్ళ ఆలోచనల‌ తీరుతెన్నుల‌ను తెలసుకోడానికి ఇవి ఉపకరిస్తాయి.
అసలు ముందుగా కరోనాకు సంబంధించిన నిర్దిష్ట అవగాహనని సంతరించు కోవాలి. ఇంతటి ఘోర విపత్తు సంభవించినప్పటికీ శాస్త్రీయ దృష్టితో ఆలోచించే ధోరణి కొరవడటం గమనించదగ్గ అంశం. కొన్ని దేశాల‌నో, కొన్ని వర్గాల‌నో, కొన్ని జాతుల‌నో నిందించే తీరును చూడొచ్చు. కానీ ఇపుడు కావాల్సింది సమ్యక్‌ వివేచన, సమగ్రమైన, హేతుబద్ధమైన ఆలోచనా విధానం. ఇతరుల‌ సంగతి ఎలా ఉన్నా కవుల‌కీ, రచయితల‌కీ ఈ వివేచన తప్పనిసరి. అలాంటప్పుడే వారి సృజనాత్మక వ్యాసంగం సరైన దిశలో సాగుతుంది.
కరోనా కాలంలో కొందరు చాలా పుస్తకాలు చదువుతున్నారు. చదివే అల‌వాట్లు ఇంకా బలంగానే ఉన్నాయని రుజువు చేసిన సందర్భమిది. సైన్స్‌ఫిక్షన్‌ పట్ల కూడా ఆసక్తిని పెంచుకుంటే వారి అధ్యయనశీల‌త కొత్త అనుభవాల్ని సంతరించుకుంటుంది. అనివార్యంగా ఇంటికే పరిమితమయిన సందర్భంలో కవుల‌, రచయితల‌ క్రియాశీల‌త ఇనుమడించింది. ఇది మున్ముందు కాలాన మంచి ఫలితాలు ఇస్తుందన్నదే ఆశ.

(పాల‌పిట్ట ఎడిటోరియ‌ల్‌, 30 ఏప్రిల్ 2020)

18, ఏప్రిల్ 2019, గురువారం

మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే విగ్రహాల ధ్వంసం ఆధిపత్య కులాలకు పరిపాటయ్యింది. దళితుల మీద నేరుగా దాడులు చేయలేనపుడు అంబేద్కర్‌ విగ్రహాల్ని లక్ష్యంగా చేసుకుంటారు. అనేకమంది నాయకుల విగ్రహాలున్నా కేవలం అంబేద్కర్‌ విగ్రహమే లక్ష్యం కావడం గమనార్హం. ఎందుకంటే అంబేద్కర్‌ ప్రతిమ కేవలం ఉత్సవ విగ్రహం కాదు, ధిక్కార నినాద గొంతుక. అణచివేతకు లోనయ్యే వారి ఆత్మగౌరవ ప్రతీక. ఆధిపత్యకులాల పెత్తనాల మీద తిరుగుబాటు బావుటా. కులనిర్మూలన కోసం సంఘటితమయ్యే పీడిత కులాల సాంస్కృతిక ఆయుధం.

26, జనవరి 2018, శుక్రవారం

అలరాస పుట్టిళ్ళు క‌థ‌ల‌ పుస్తకం మ‌ర‌ల మ‌ర‌ల చ‌ద‌వాల్సిన పుస్త‌కం. ర‌చ‌యిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.
వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.
కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.
కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.
చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.
ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.
పాఠ‌కుని స‌మ‌యాన్ని వృధా చేయ‌ని మేలిమి క‌థ‌ల సంపుటి అల‌రాస పుట్టిళ్ళు. 

15, జులై 2017, శనివారం

'మధుమానసం'లో అందమైన వచనం 

కొందరి ప్రతిభ లలిత లలిత మైంది.       సున్నితమైన  వ్యక్తీకరణలతో  తమ మానసిక ప్రపంచాన్ని అతి సుందరంగా, లలితంగా వ్యక్తీకరిస్తారు. ఈ కోవకు   చెందిన కవయిత్రి మానస చామర్తి. ఈ ఏడాది - 2015- ఇస్మాయిల్‌ పురస్కారాన్ని ఆమెకు అందజేయనున్నట్టు యదుకుల భూషణ్‌    ఒక ప్రకటనలో తెలియజేశారు. మానస కవిత్వ పుస్తకం రాలేదు. బ్లాగులో ఆమె కవిత్వం వుంది. ఆ కవిత్వాన్నే కాదు, ఆమె వచనాన్ని చదివినా పాఠకులు ముగ్ధులవుతారు. అందుకే ప్రత్యేకించి ఆమె కవిత్వం కన్నా బ్లాగు గురించి సంక్షిప్త పరిచయం పాఠకులకు ప్రత్యేకం. 

బ్లాగు రాయడం ఓ కళ. తమ అనుభవాలు, అనుభూతులు, అంతరంగాన్ని కదిపి కుదిపే ఘటనలు ఎన్నిటినో అక్షరాల్లో కూర్చి ఆవిష్కరించడం ఓ కళాసాధన. తమ భావనా పరంపరని అందంగా, ఆర్ద్రంగా, పఠిత మనసు మెచ్చేలా రాయడం ఓ సృజనాత్మక కౌశలం. అలాంటి కౌశలం, సృజనాత్మక ప్రతిభ మానస చామర్తి గారి 'మధుమానసం' బ్లాగులో దాగుంది. చదివిన కొద్దీ చదవాలనిపించే తియ్యందనాలు ఈ బ్లాగులో వున్నాయి. 

వైవిధ్యమైన ఉత్తమ అభిరుచులతో మిళితమైన ఆమె బ్లాగు చదవడమూ చక్కటి సృజనాత్మక అనుభవం. అక్షరాలకు సౌందర్యాన్ని సమకూర్చే ఇంద్రజాలమేదో ఆమెకు ఉంది. విభిన్న ప్రక్రియలతో కూడిన ఈ బ్లాగులోని కవిత్వమూ, వచనమూ పరమ ఆకర్షణీయం. 

అప్పుడప్పుడు రాసిన కవితలు, వ్యాసాలు, యాత్రాకథనాలు, పుస్తక పఠనానుభవాలు, అనేకానేక అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ బ్లాగుకు నిండుదనాన్ని సమకూర్చాయి. సంగీతం, పాటల మీద వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఓ మార్దవం వుంది. యాత్రాకథనాల్లో 'గోకర్ణం' గురించి రాసిన లలిత లలితమైన కథనం చదవడం మనసుని పరిమళింపజేసే అనుభవం. 'శివం సుందరం గోకర్ణం' శీర్షికన రాసిన ఈ కథనం నేరుగా పాఠకుణ్ణి గోకర్ణం తీసుకెళుతుంది. అక్షరాల్లోని రమ్యత, పదాల్లోని సొగసుదనం, వాక్యాల్లోని ఇంద్రజాలం ఈ వ్యాసానికి ఒక మహత్తును సమకూ ర్చాయి. బహుశా అది ఆ ప్రాంతానికి కూడా వుందేమో! ఈ వ్యాసం చదివాక గోకర్ణం ఎప్పుడు చూద్దామా అని మనసు కొట్టుకులా డుతుంది. 

కవుల కవిత్వాల్లో నందకిశోర్‌     కవిత్వ సంపుటి 'నీలాగే ఒకడుండేవాడు' మీద రాసిన వ్యాసం, అలాగే బుచ్చిబాబు 'చివరకు మిగిలేది', చలం 'పురూరవ'లపై విశ్లేషణలు బావున్నాయి. ఈ నవలలని కొత్తతరం పాఠకులకు చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. వచనాన్ని అత్యంత సౌందర్యభరితంగా వాడుకున్న రచయితలు చలం, బుచ్చిబాబు.  వారి గురించి మానస వ్యక్తం చేసిన అభిప్రాయాలు సాహిత్యంలో సౌందర్యాన్ని చూసే ఆమె దృష్టికోణాన్ని తెలియజేస్తాయి. 

'అనుభవాలూ జ్ఞాపకాలూనూ' శీర్షికన చేసిన రచనలు కూడా వైవిధ్యంగా వున్నాయి. ఆమె ఊహాశాలితను తెలియజేస్తాయి. జ్ఞాపకాల్ని అభివ్యక్తం   చేయడంలో    వాక్యవిన్యాసమూ ఆకట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే మానస గారి ప్రతి రచనలోనూ సౌందర్యాత్మకత ప్రతిఫలిస్తుంది. గుండె గొంతులో తారాట్లాడే భావాన్ని అందంగా చెప్పాడానికి ప్రయత్నించారు. బహుశా అందంగా చెప్పడం ఆమెకు అలవోకగా అబ్బిందనిపిస్తుంది ఈ బ్లాగును చదివితే. ఒక మంచి పుస్తకంలో నచ్చిన అధ్యాయాల్ని కొంచెం కొంచెం ఇష్టంగా చదివినట్టు ఈ 'మధుమానసం' బ్లాగును చదవాలి. బ్లాగు చిరునామా: 

http://www.madhumanasam.in. మానస చామర్తి గారి గురించిన వివరాల్ని ఫేస్‌బుక్‌లోనూ చూడొచ్చు. సృజనాత్మకంగా జీవించే తత్వమే ఆమె బ్లాగుకు మూలం.

10, మార్చి 2017, శుక్రవారం

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి పుస్తకం చదివా. వారి అనుభావాల పరమ్పర బాగుంది.

రాసిన తీరు నచ్చింది.

కొన్ని కొత్త విషయాలున్నాయి.

ఒక మనిషి ప్రయాణం ఎన్ని విధాలుగా మలుపులు తిరిగే అవకాశం ఉన్నదో తెలుస్తుంది.
ఆ ప్రయాణమే ఆసక్తికరం. 
మరల మరల చదివించే కవిత్వమే నిజమైన కవిత్వమ్.

ఆలాంటి వొక పుస్తకం అమృతం కురిసిన రాత్రి. ఈ రాత్రి మరల వొకసారి చదివాను.

దేవరకొండ బాలగంగాధర తిలక్ 

19, మే 2014, సోమవారం

ఇప్పుడు తను వొంటరి

వొంటరితనం నుంచి దాస్ కాపిటల్ సేవ్ చేయదు

మాన్ ఇస్ సోషల్ అనిమల్ అన్నారు

మరి ఎందుకీ వొంటరితనం

ఎవరు చెప్పగలరు

ఆ మధ్యన 60 ఇయర్స్ కామ్రేడ్ వచ్చారు

వొంటరి గా ఉండాలంటే భయం గా ఉంటుందని చెప్పాడు

30 ఇయర్స్ వెనుక విప్లవాన్ని గురించి ఎంతో చెప్పేవాడు

ఇప్పుడు తను వొంటరి

సమాజం మారలేదు

విప్లవం రాలేదు

తోడూ గా ఉండే భార్య అమెరికా లో ఉంది

ఇల్లు ఉంది

ఇంట్లో డాలర్స్ ఉన్నాయ్

పలకరించే మనిషి లేదు

విప్లవాల మిత్రులు ఎవరూ రారు.

కలవరు

మాట్లాడరు

ఫోన్ చేయరు

వొక సమ సమాజం గురించి వందల గ్రామాలలో తిరిగి మాట్లాడిన మనిషి ఇప్పుడు
వొంటరి.

ఎంతటి విషాదం.

లైఫ్ ఇస్ బ్యూటిఫుల్

లైఫ్ ఇస్ misereable

వొంటరితనం వొక సమూహాన్ని కల గన్న కవికి రావడం ఏమిటి

కలలు చెదిరిన కాలం చెప్పిన పాఠం ఏమిటి

సొంత లాభం కొంత చూసుకు బతకవలేనోయి అని చెప్పకనే చెప్పడం కదా.

ప్లీజ్  థింక్ అబౌట్ ఇట్  

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

love 2020

కొన్ని సార్లు చిత్రమైన అనుభవాలు ఎదురువుతాయి.

ఈ రోజు వొక మిత్రుడు ఆఫీసుకు వచ్చాదు. 'సంవిధానం'లో ప్రతాప్ కథల గురించి రాసిన వ్యాసం తిరగేసాడు.

ప్రతాప్ కథ లవ్ 2020 గురించి  రాసిన కొన్ని వాక్యాలు తనకు నచ్చాయి.

ఆ కథ చదవాలని ఉంది. కావాలన్నాడు.

సరే, తరవాత ఇస్తానని చెప్పా.

 రచన మనకు తెలియకనే మనుషులను ఆలోచింప చేస్తుంది కదా అనిపించింది.

చాన్నాళ్ళ కిందట కాశీభట్ల రచనల గురించి రాసినప్పుడు కొంతమంది నుంచి ఈ రకమైన స్పందన చూసా.

మరల ఇప్పుడు ఆలాంటి స్పర్శ.

ప్రతాప్ రాసిన కొన్ని కథలు అప్పుడప్పుడు గుర్తు కొస్తాయి.

వాటి లో లవ్ 2020 వొకటి.

మనకు బావుందనిపించే రచనల గురించి పదిమందికి తెలియచెప్పడం ఉపయోగకరం

ఈ నడుమ జలంధర గారి నవల  గురించి రాసా.

కోటబుల్ కోట్స్ లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి.

వాటిని వొక చోట చేర్చి పుస్తకం తీసుకు వచ్చినా బావుంటుంది.

  

3, ఫిబ్రవరి 2014, సోమవారం

చూడని బతుకు పొరలు

బయటి గుడిసెలు

దేవులపల్లి కృష్ణమూర్తి  రాసిన నవల బయటి గుడిసెలు.

మొదలు పెడితే ఆసాంతం చదివించింది. మన ఆలోచన స్రవంతి కి రాని మనుషుల జీవితాలను సృజించారు.

అయినప్పటికీ మనచే చదివింప చేస్తుంది. జీవితపు మరో పారశ్వాన్ని చూపిస్తారు రచియత.

మన తో నిమిత్తం లేకుండా నవల లోని పత్రాల వెంటే నడిచి వెలతము.

అప్పటివరకు చూడని బతుకు పొరలు చూస్తాము.

ఇందుకోసమే ఈ నవల చదవాలి.

సమాజాన్ని ధిక్కరిస్థున్నామని తెలియకుండానే ఆ పని చేస్తున్న వారి బతుకులు ఎలా ఉన్నాయో, వారి జీవితం లో వారు ఏమి కోరుకుంటున్నారో ఈ నవల చదివితే తెలుస్తుంది.

తమకు నచ్చినట్టు బతకడం చాల సహజంగా చేసే పని.

ఆ తెగువ చూపే ధైర్యం సమాజం చూడ నిరాకరించే వారికి మాత్రమే సాధ్యం.

ఈ విషయం ఈ నవల లో చూస్తాము. అందుకోసమే ఈ నవల వాస్తవికతకు దగ్గరగా ఉంది.

reyalisam శిల్పాన్ని కృష్ణముర్తి గారు బాగా వాడుకున్నారు.

వొక మంచి నవల చదివిన సంతృప్తి కలుగుతుంది చదివాక. 

7, జనవరి 2014, మంగళవారం

యువతకు మేలు చేసే రచన

మన సమాజం లో సానుకూల దృక్పధం గురించి చెప్పడం అంత సులువు కాదు.

మరీ ముఖ్యంగా సాహిత్యం లో పాజిటివ్ విషయాల గురించి చెప్పడం చాల మందికి నచ్చదు.

నెగటివ్ గా చెబితే వినే లక్షణం ఉన్నది.

కాని నేగటివిజం ప్రతి సారి కరెక్ట్ కాదు.

దీనికి సంబంధించి జలంధర నవల పున్నాగ పూలు లో చాల చర్చించారు.

ఆలోచించడం ఎలానో తెలియాలి.  అందుకే సరిగ్గా ఆలోచించడం నేర్పాలని జలంధర గారు అన్నారు.

మరల ఆ నవల కొన్ని పేజెస్ చదివా.

చాల మంది రచనల్లో నెగటివ్ షేడ్స్ ఎక్కువ.

ఇతరులను తిట్టడం వల్ల ఫాయిదా లేదు.

మరల మరల చదివించే మంచి నవల పున్నాగ పూలు.

చదివిన ప్రతిసారి వొక మేల్కొలుపు లా ఉంది. నిజంగానే యువతకు మేలు చేసే రచన ఇది.

1, డిసెంబర్ 2013, ఆదివారం

అలరాస పుట్టిళ్ళు

అలరాస పుట్టిళ్ళు పుస్తకం చదివా మరోసారి. కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి.

వొకనాటి పల్లెల వాతావరణాన్ని దర్శింప జెసారు.

కథ రాయడం లో ఆమె నేర్పరితనం అబ్బురపరుస్తుంది.

కథ లో ఉండాల్సిన సౌందర్యం ఏమిటో ఆమెకు తెలుసు.

చెప్పడం లో వొక అందం ఉండాలి. సొగసుదనం ఉట్టి పడాలి.

ఈ సంగతి తెలిసిన రచయిత్రి కళ్యాణ సుందరి జగన్నాధ్.

మన ప్రాంతం మన కథ లో కనిపించాలి. ఇది ఈమె కథల్లో చూస్తాం.

మరల మరల చదవాల్సిన పుస్తకమిది

22, నవంబర్ 2013, శుక్రవారం

చదవడం వొక కళ

చదవడం వొక కళ. శిశు హృదయం తో చదవాలి.  ఎన్ని పుస్తకాలు చదివినా వొక కొత్త పుస్తకం పటుకున్నపుడు కొత్తగా మొదలు పెట్టాలి.

కొందరు చదవకుండానే అంత తెలిసినట్టు మాట్లాడుతారు. చదవకుండానే ఆ పుస్తకాన్ని గురించి తీర్పులు ఇస్తుంటారు..

ఆ మధ్యన వొక పెద్ద రచయితను ఝుంప లాహిరి నవల ది లో ల్యాండ్ చదివారా అని అడిగా.

విదేశాల్లో ఉండే భారతీయ రచయితలంతా హంబగ్ అని తేల్చి వేసాడు. వారు రాసే దాన్నిలో ఏమి ఉండదన్నాడు. చాల తేలికగా మాట్లాడాడు. ఎవరి సంగతి ఏమో గాని ఝుంప లాహిరి కొట్టి పడేయదగ్గ రచయిత్రి కాదు.

ఆమె రచనలు  సీరియస్ గా, సిన్సియర్ గా ఉంటాయి. aesthetic beautry ఉన్న రచనలు చేసారు ఆవిడ.

కాని సదరు రచియత ఏమి చదవకుండానే ఆమె గురించి తేలికగా మాట్లాడాడు.

అందుకే చదవడం వొక కళ. లోలోపల తపన ఉండాలే తప్ప బలవవంతం గా
ఎవరూ చదివించలెరు.

మనసు పెట్టి చదవాలి. అప్పుడే చదువు లో ఆనందం తెలుస్తుంది. చదవడం హృదయానికి ఎలాంటి వెలుగుని ఇస్తుందో అనుభవం లోకి వస్తుంది.

చదవడం కూడా వొక కళ అని పెద్దలు చెప్పారు.

ఆ కళలో ఆరితేరిన వారు చదువు లోని ఆనందం అనుభవిస్తారు.


9, నవంబర్ 2013, శనివారం

హాయిగా ఉండటం ఎలానో చెప్పిన జలంధర కథలు

మనకు నచ్చిన పుస్తకం అయితే ఎన్ని సార్లయినా చదువుతాం

నచ్చిన పాటని పదేపదే విన్నట్టు 

నచ్చిన కవితని మరల మరల చదివినట్టు నచ్చిన కథని, నచ్చిన నవలని చదువుతూనే ఉంటాము. 

వొక పువ్వు పూసింది కథని ఎన్ని సార్లు చదివామో కదా. 

జీవాతాదర్శము ఎన్నిసార్లు చదివమొ. 

దేశికా చారి  బాగా నచ్చాడు 

లాలస పేరులోనే తెలియని వలపు ఉన్నది. 

ఏదో మహత్తు ఉంది. 

వొక పువ్వుని చూస్తూ యుగాలు గడపొచ్చు అన్నాడు వొకాయన. 

వొక పుస్తకం చదువుతూ హాయిగా గడపొచ్చు. 

అలా చదివే అలవాటు ఉన్నవారు యెవరున్నారు. 

ఎవరి సంగతి నాకు అక్కరలేదు. 

నాకు మాత్రం చదువులోనే గొప్ప రిలీఫ్ ఉన్నది 

చదువు లోనే హాయిదనం ఉంది. 

హాయిగా ఉండటం ఎలానో చెప్పిన జలంధర కథలు చదవండి. 

8, నవంబర్ 2013, శుక్రవారం

హృదయాన్ని తాకుతాడు తిలక్

ఏ రాత్రో ఏదైనా కవిత్వం చదవాలనిపిస్తే బైరాగి పుస్తకాన్ని చేతి లోకి తిసుకున్తను. 

లేదంటే అమృతం కురిసిన రాత్రి చదువుతాను. 

వజీర్ రహమాన్ 'ఎచటికి పోతావీ రాత్రి'ని ఇష్టంగా చేరుకుంటాను 

ఇస్మాయిల్ ని కూడా కొన్ని రాత్రుల్లొ పలకరిస్తాను. 

శ్రీ శ్రీ ని ఆలస్యంగా తెలుసుకున్న. 

అయినప్పటికీ మరల మరల చదివా 

నిజానికి తిలక్ నే ఎక్కువ సార్లు చదివా 

శ్రీ శ్రీ బుద్ధిని తాకితే, తిలక్ హృదయాన్ని తాకుతాడు. 

లొలొఅపలికి చూసుకోవడానికి తిలక్, బైరాగి లు దారి చూపుతారు. 

కవిత్వాన్ని ప్రేమించడం తిలక్ నేర్పాడు 

శివసాగర్ వొక వయసు లో ఉగించి శాసించాడు 

కవిత్వం లో సౌందర్యాన్ని చూడటం నేర్పిన కవి శివ సాగర్ 

ఆయన కవిత్వాన్ని పారాయణం చేసిన రోజులున్నై. 

6, నవంబర్ 2013, బుధవారం

పున్నాగపూలు నవల లో ఈరోజు మరి కొన్ని పేజెస్ చదివాను. 

బుచ్చిబాబు గారి నవల చివరకు మిగిలేది తరవాత మరల మరల చదవాలనిపించే నవల ఇది అనిపిస్తుంది. 

చలం జీవితాదర్శం నవలని చాల సార్లు చదివా. 

మైదానం తో పటు చలం జీవితాదర్శం చదివితేనే చలం ఏమిటో, ఏమి చెప్పాడో తెలుస్తుంది 

ఈతరానికి ఏం కావాలో తెలిసిన క్రియేటివ్ రైటర్ జలంధర గారు. 

ఆమె కథలు, ఆ కథల్లోని కొన్ని పాత్రలు నాకు బాగా గుర్తు 

వియద్గంగ కథ ని మరల మరల చదవాలి. 

ఆలాగే పూర్ణిమ కథ కూడా. 

హాయిగా ఉండడం ఎలాగో నాకు తెలుసు అని వొక స్త్రీ పాత్ర చెప్పడం లో ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 

జలంధర గారి కథల్లో గాని, నవల లో గాని ఫిర్యాదులు లేవు. 

ఆలోచించడం నేర్పాలి అనే మాట ఈ నవల లో నాకు బాగా నచ్చింది. 

నిజమే, మన చుట్టూ ఉండే వాళ్ళలో చాల మందికి ఆలోచించడం ఎలానో నేర్పాలి. 

సాహిత్యం మీద ప్రేమ, ఇష్టం ఉన్నవాళ్లు వొక సారి జలంధర గారి కథలు చదవండి 

పున్నాగ పూలు నవల తప్పనిసరిగా చదవాలి 

నవల ని ప్రమోట్ చేస్తున్నట్టు గా అనిపిస్తుందేమో ఈ మాట. 

కావచ్చు,  తెలియని వాళ్లకు తెలియ జెప్పడం తప్పు కాదు. అంతే గాక వొక మంచి పుస్తకం గురించి యెంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా నష్టం లెదు. 

ఇలా చెప్పడం ప్రేమతో, ఇష్టంతో చేసే పని. 
ఇదివరకు వొక మంచి పుస్తకం గురించి మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాళ్ళం. 

ఇదీ  ఆలాంటి ఉత్తరమే. 
జలంధర గారి సృజనాత్మక శైలి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. 

4, నవంబర్ 2013, సోమవారం

ఈ మధ్యన జలంధర గారి నవల 'పూన్నాగ పూలు' చదివా.

400 పేజి ల నవల చదివించింది

రచయిత్రి ఊహా శక్తి కి జోహార్లు చెప్పాలి

రాధ పాత్ర ని తీర్చి దిద్దిన తీరు అపురూపం.

విశ్లేషణ సులువు కాదు.

చదవాలి. చదివి ఆ పారవశ్యం లో తేలియాడాలి.

వొక సుదీర్ఘమైన నవల రాయాడానికి చాల సమయం పడుతుంది.

పాత్రల నడుమ, సంఘటనల నడుమ అంతర్గత సంబంధం కొనసాగించాలి

దీనికి ఎంతో కసరత్తు చేయాలి

చివరకు నవల తనకు నచ్చాలి

రీడర్స్ కు నచ్చాలి

400 పేజిల చదివించాలంటే అంత ఉద్విగ్న భరిత కొనసాగింపు కావాలి.

ఈరకంగా రచయిత్రి కోణం లో నుంచి చూసినప్పుడు నవల రాయడం వెనుక జలంధర గారి శ్రమ చిన్నదేం కాదు

ఈ నవల ని 3 రోజుల్లో చదివా

ఎక్కడ ఆపాలనిపించలేదు

వొక్కొక్క పాత్ర ని రూపొన్దీంచిన తీరు విస్మయం గొల్పింది

జలంధర తాత్త్విక భావ ధార ఈ నవల లో మరింత స్పష్టంగా అభివ్యక్తమైంది

ఆమె ికథలు చదివి ఉంటే ఈ నవల ద్వారా జలంధర గారి ఆలోచనా ధార ఇంకా స్పష్టం గా అర్ధమవుతుంది

తమకు ఏమి కావాలో తెలియక చాల మంది నానా గందరగోళం లో పడి బ్రతుకు వృధా చేసుకుంటారు.

కాని జీవితం వోక్కసారే వొస్తుంది
దానిని ఎలా మలుచుకోవాలో చెప్పకనే చెబుతుంది ఈ నవల.

24, అక్టోబర్ 2013, గురువారం

తెలుగు వాక్యానికి కొత్త 'సోయగం

వొక మంచి  తెలుగు వాక్యం కోసం రాజిరెడ్డి పుస్తకం చదవాలి.

జర్నలిస్ట్లు గా  ఎక్కువ కాలం ఉంటె సృజనాత్మకత దెబ్బ తింటుందని గతంలో అనేవాళ్ళు.

అది నిజం కాదని మాధవ్, రాజిరెడ్డి ప్రూవ్ చేశారు.

మాధవ్ పుస్తకం ఆభౌతిక స్వరం చదవండి.

రాత్రి వేళ ఏకాంతంలో తన వాక్యం చదవడం ఎంతో ఆహ్లాదకర అనుభవం.

వాక్యాలకు తెలియని పరిమళం ఉంటుంది.

ఆ పరిమళానికి మనమే ఏదైనా పేరు పెట్టాలి.

లోలోపల వొక మధుర భావన సుడులు తిరుగుతుంది.

మనకు తెల్సినట్టే ఉండి తెలియని వారి గురించి రాసిన పధ్ధతి లోని కొత్తదనం చూసి పడిపోతాం.

ఇలా కూడా రాయవచ్చునా అనుకుంటారు.

ఇలా రాయడం వల్లనే రీడర్స్ దగ్గరికి చేరుకోగలం.

ఫీచర్ రైటింగ్ ఎలా ఉండాలో మాధవ్ తో కొత్త వారికి, కొంత మంది పాత వారికి కూడా క్లాసు ఇప్పించాలి.

చాల మందికి తెలియదు కాని మాధవ్ కథలు రాసాడు.

మన కాలానికి అవసరమైన రచయిత మాధవ్.
...

రాజిరెడ్డి పుస్తకం పలక పెన్సిల్ నాకు బాగా నచ్చింది

నేను చెప్పాలనుకునే విషయాలని నా కన్నా బాగా చెప్పాడు

నా మనసులో ఉండే విషయాలని... నాలో నేను తర్కించిన సంగతులు ఎన్నో రాజిరెడ్డి చెప్పాడు

చాన్నాళ్ళ కిందట జి. కృష్ణ గారు వొకసారి క్లాసు లో చెప్పారు- మామూలు విషయాల మీద రాయడం లోనే అసలు సిసలు ప్రతిభ ఉన్నదని.

అవీ ఇవీ అని చాలా సాదా సీదా సంగతుల గురించి ఆయన రాసారు. చదువుతుంటే ఎంతో థ్రిల్.

సీరియస్ గా రాయాలి అని గంభీరం గా మొదలు పెట్టి ఎక్కడో తప్పి పోయే కాలమిస్ట్ లని చూస్తుంటాం.

కాని మొదలు పెట్టడమే మనతో ముచ్చట పెట్టినట్టు ఎత్తుకోవడం రాజిరెడ్డి చేసాడు.

మామూలు గా చెప్పే ముచ్చట్ల తోనే మన మనసుకు హత్తుకునేట్టు చెప్పడం వొక కళ.

ఇలా చెప్పిన మాటలే మరేదో సందర్భం లో రాజిరెడ్డి అప్పుడే చెప్పాడు కదా అనుకుంటాము.

ప్రేమ గురించి భలే రాసాడు రాజిరెడ్డి. చలం చెప్పాక ఇంకా ప్రేమ గురించి చెప్పాడానికి ఏం ఉంటుందనుకోవద్దు.

చెప్పడానికి, మనసును మరింత బాగా హత్తు కోవడానికి ఛాన్స్ ఉంది.

మన వెలుగు వెన్నెల ఆమే అని బాగా చెప్పాడు. ఈ వ్యాసం చివరి రెండు లైన్లు మనసైన ఆమ్మాయితో చెబితే యెంత ముచ్చట పడుతుందో కదా.

ఇంతకీ ఏమిటా  రెండు లైన్లు అని అడగదలుచుకున్నారా.

పలక పెన్సిల్ చదవండి. మీకే తెలుస్తుంది.

ఆ రెండు వాక్యాల కోసం పుస్తకం తీసుకోవాలి. చదవాలి. చదివి  పరవశించి పోవాలి.

అందుకే రాజిరెడ్డి కేవలం పత్రికా  రచయిత కాదుhe  is  creative  writer

23, అక్టోబర్ 2013, బుధవారం

నిత్య గాయాల నది

తెలుగు కథా సాహిత్యం లో కొందరు అరుదుగా మంచి కథలు రాస్తారు. వారి లో చెప్పుకోదగిన రచయిత బెజ్జ్జా రపు రవీందర్. ఆ కథల పుస్తకం ఇప్పుడు విదుదలయిన్ది.  

మరోసారి చదివాను. 

కథ లో ఉండవలసిన సౌందర్యం ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వస్తువు ని కళాత్మకం గా మలచడం ఎలాగో అతనికి తెలుసు. 

కథ అంటే ఎలా ఉండాలో తెలుసు. 

ఇతని కథ చదవడం మన కాలం వృధా చేసుకోవడం కాదు. 

ట్రూ యువర్ సెల్ఫ్ అని కొందరు రచయితలు చెబుతుంటారు. 

తను ఏమిటో రవీందర్ కి తెలుసు. 

వొక ఉద్విగ్నత కు లోను చేయగల కథనం ఇతని కథల్లో ఇమిడి ఉన్నది. 

తెలంగాణా నుంచి వచ్చిన అరుదైన రచయిత రవీందర్. ప్రచార ఆర్భాటం లేని రచయిత. ఐడెంటిటీ క్రైసిస్ లేదు అతనికి. 

తన కన్నా తన కథలు జనం లోకి వెళ్ళాలని భావించే రచయిత  రవీందర్. 

చరణం జారి పోయాక కథ చదవండి. రియాలిటీ ని చెప్పడం ఏలనో తెలుస్తుంది. కథ చదివాక మనలో ఆలజడి చెలరేగాలి. తెలియకనే ఆలోచనల్లోకి జారిపోవాలి. పాత్రల కదలికలు మనలో వొక చలనం తీసుకు రావాలి. 

నిత్య గాయాల నది పుస్తకం పేరు. ఇదే పేరుతొ వొక కథ ఉన్నది. తెలంగాణా సంవేదనను ఏంటో ఆర్ద్రం గా చెబుతారు. 

రచయితా ఊహాశాలిత అబ్బురపరుస్తుంది. 

చాల కాలానికి తెలంగాణా కు చెందిన వొక మంచి కథల పుస్తకం చదివిన అనుభూతి. 
నినాదం కథ కాదు. 

పాత్రలకు ఉద్వేగాలు ఉండవచ్చు కాని రచయిత కు ఉండ కూడదు. ఈ సంగతి రవీందర్ కి తెలుసు. 

అందుకే అతని కథల్లో ఉండే వొరవడి మనలకి  ప్రత్యేక ఆకర్షణ. 

కవిత్వం లానే రవీందర్ కథలు మరోసారి మరోసారి చదువుకోవచ్చు. 

యాంగ్ మో రాసిన ఉద‌య‌గీతిక నాకు అత్యంత ఇష్ట‌మైన న‌వ‌ల‌. క్యాంప‌స్‌లో ఏ హాస్ట‌ల్‌లో ఉండ‌గా దొరికిన న‌వ‌ల ఇది. న‌వ‌ల చేతికొచ్చి చ‌ద‌వ‌డం మొద‌ల...