కొత్త ఇతివృత్తం
మొట్టమొదటిసారి యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. కరోనా కల్లోలం ఎక్కడికక్కడ మనుషుల్ని నిలువరించింది. ఉన్నచోటనే ఉండిపోక తప్పని పరిస్థితుల్ని సృష్టించింది. పని చేస్తే తప్ప పూట గడవని వారు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విపత్తుకు ఎలా స్పందించాలో తెలియక లోకమంతా నిశ్చేష్ట కాగా, తొలుత జర్నలిస్టులు, కవులు, రచయితలు స్పందిస్తూ వచ్చారు. కొందరు జర్నలిస్టులు కరోనా గురించి మన దగ్గర ఫిబ్రవరి లోనే హెచ్చరించారు. కానీ దాని తీవ్రతని గుర్తించ నిరాకరించిన విధాననిర్ణేతలు ఆస్యంగా స్పందించారు. అయినప్పటికీ సంపన్నదేశాల కన్నా మెరుగయిన స్థితిలో ఉండటం ఇప్పటికయితే సాధ్యపడిరది.
ఎప్పటి మాదిరిగానే తెలుగు నాట కరోనా మీద కవిత్వమే విస్తారంగా వస్తున్నది. కొద్దిమంది మాత్రమే కరోనా ప్రభావిత బతుకు తండ్లాటని కథలుగా రాస్తున్నారు. వచనంలో మున్ముందు ఎలాంటి రచనలు వస్తాయో చూడాలి. లాక్‌డౌన్ పీరియడ్ జనం బతుకుల్లో సృష్టించిన ఆర్థిక, మానసిక, సాంస్కృతిక కల్లోలం అనూహ్యం. పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్న సంక్షోభ సందర్భమిది. ధీరగుణం ప్రదర్శించాని కొందరు చెబుతున్నప్పటికీ అది అంత సులువు కాదు. కనుకనే జన జీవితాన్ని విషాద బీభత్సానికి లోను చేసిన ఈ కాలం సృజనశీలురకు తగిన ఇతివృత్తం. దీని మీద నవలలు రావాల్సి వుం ది. ‘కరోనా కాలం’ మీద నాన్ ఫిక్షన్ కూడా వచ్చే అవకాశముంది. తెలుగునాట రచయితలు ఎలా స్పందిస్తారో చూడాలి.
1929 నాటి మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) కాలం, తర్వాత రెండు ప్రపంచ యుద్ధా కాలం నాటి జనం బతుకులకు సంబంధించిన ప్రతిఫలనాలు కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో కొంతవరకు కనిపిస్తాయి. మరి ఇవాళ కరోనా కాలపు భీతావహస్థితి సాహిత్య, కళారూపాల్లో చిత్రితమయ్యే తీరును మున్ముందు చూడగలం. తక్షణ స్పందనగా వచ్చే కవిత్వంలో భిన్నధోరణలున్నాయి. కానీ ఈ విపత్తు తీవ్రత ప్రభావం సామాజిక, వైయుక్తిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ సంక్షుభిత సన్నివేశాలు సాహిత్యంలోనే ప్రబలంగా చిత్రించడం సాధ్యం. కొన్ని అంశాలు మీడియా కూడా చెప్పలేదు. రచయితలే చెప్పగలరు. సోషల్‌మీడియాలో తక్షణ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. మనవాళ్ళ ఆలోచనల తీరుతెన్నులను తెలసుకోడానికి ఇవి ఉపకరిస్తాయి.
అసలు ముందుగా కరోనాకు సంబంధించిన నిర్దిష్ట అవగాహనని సంతరించు కోవాలి. ఇంతటి ఘోర విపత్తు సంభవించినప్పటికీ శాస్త్రీయ దృష్టితో ఆలోచించే ధోరణి కొరవడటం గమనించదగ్గ అంశం. కొన్ని దేశాలనో, కొన్ని వర్గాలనో, కొన్ని జాతులనో నిందించే తీరును చూడొచ్చు. కానీ ఇపుడు కావాల్సింది సమ్యక్ వివేచన, సమగ్రమైన, హేతుబద్ధమైన ఆలోచనా విధానం. ఇతరుల సంగతి ఎలా ఉన్నా కవులకీ, రచయితలకీ ఈ వివేచన తప్పనిసరి. అలాంటప్పుడే వారి సృజనాత్మక వ్యాసంగం సరైన దిశలో సాగుతుంది.
కరోనా కాలంలో కొందరు చాలా పుస్తకాలు చదువుతున్నారు. చదివే అలవాట్లు ఇంకా బలంగానే ఉన్నాయని రుజువు చేసిన సందర్భమిది. సైన్స్‌ఫిక్షన్ పట్ల కూడా ఆసక్తిని పెంచుకుంటే వారి అధ్యయనశీలత కొత్త అనుభవాల్ని సంతరించుకుంటుంది. అనివార్యంగా ఇంటికే పరిమితమయిన సందర్భంలో కవుల, రచయితల క్రియాశీలత ఇనుమడించింది. ఇది మున్ముందు కాలాన మంచి ఫలితాలు ఇస్తుందన్నదే ఆశ.
(పాలపిట్ట ఎడిటోరియల్, 30 ఏప్రిల్ 2020)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి